- గోదావరిఖని మీదుగా వెళ్లినట్లు అనుమానం
- మంచిర్యాల జిల్లాలో స్కార్పియో లభ్యం ?
- మొన్న పీఎంజే.. నిన్న భగత్ నగర్ దోపిడీతో కలకలం
- ఇండ్లలోనూ పెరిగిన చోరీలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడు ఎస్బీఐ ఏటీఎంలలో దోపిడీకి పాల్పడిన దొంగలు రాష్ట్రం దాటినట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి గోదావరిఖని, మంచిర్యాల మీదుగా మహారాష్ట్రలోని చంద్రపూర్ వైపు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజీవ్ రహదారిలో బసంత్ నగర్ వద్ద వచ్చే టోల్ గేట్ లోకి ఎంట్రీ కాకుండా మరో రూట్ లో వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్, ఇతర టెక్నాలజీని ఉపయోగించి దోపిడీ ముఠా కోసం గాలిస్తున్నారు. ఈ దారిలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
-
టోల్ ప్లాజాలను తప్పించుకుంటూ..
- ఏటీఎంలలో చోరీకి పాల్పడిన ముఠా గూగుల్ మ్యాప్ ద్వారా లేదంటే ప్రత్యేక యాప్ ద్వారా టోల్ ప్లాజాలను తప్పించుకుంటూ పరారైనట్లు తెలుస్తోంది. వీరి స్కార్పియో తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజాలోగానీ, గోదావరిఖని వైపు వెళ్తుండగా వచ్చే బసంత్ నగర్ టోల్ ప్లాజాలో గానీ ఎక్కడా రికార్డు కాలేదు. దీంతో ఈ ముఠా డీ రూట్(టోల్ ప్లాజాను తప్పించుకొని ఇతర మార్గాల్లో ప్రయాణించి మళ్లీ హైవేకు కనెక్ట్ కావడం) ద్వారానే రాకపోకలు సాగించినట్టుగా తెలుస్తోంది. స్కార్పియో వాహనానికి తగిలించిన నంబర్ ప్లేట్(ఎంహెచ్ 03 ఈబీ 4258) కూడా నకిలీదిగా పోలీసులు గుర్తించారు. కాగా వారి వాహనం మంచిర్యాల జిల్లాలో దొరికిందనే ప్రచారం జరుగుతోంది.
-
హర్యానా మేవాత్ గ్యాంగ్ పనేనా?
- గత నెలలో మెదక్ జిల్లా మంబోజిపల్లి చౌరస్తాలో ఉన్న ఎస్ బీఐ ఏటీఎంతోపాటు చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి సుమారు రూ.29 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ముఖాలకు మాస్కులు ధరించి, ఏటీఎం గదిలోకి వచ్చి మెషీన్‌ను ధ్వంసం చేశారు. అంతకుముందు నిరుడు డిసెంబర్ 26న నిజామాబాద్‌లోనూ ఇలాగే గ్యాస్ కట్టర్లతో రెండు ఏటీఎంలు కట్ చేసి సుమారు రూ.30 లక్షలు దోచుకెళ్లారు. ఏప్రిల్ 11న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి సుమారు రూ.6 లక్షలు అపహరించారు. గత నెలలో మెదక్ జిల్లాలో, అంతకుముందు నిజామాబాద్, తాజాగా కరీంనగర్ జిల్లాలో దోపిడీకి పాల్పడిన తీరు ఒకే విధంగా ఉండడంతో.. ఈ దోపిడీలు ఒకే ముఠా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హర్యానాకు చెందిన మేవాత్ గ్యాంగ్ గా భావిస్తున్నారు.
-
మొన్న పీఎంజే.. నిన్న భగత్ నగర్ దోపిడీ ఘటనలు
- కరీంనగర్ జిల్లాను అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాలు టార్గెట్ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మే 3న పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ చోరీకి బిహార్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుబోధ్ సింగ్(గోల్డెన్ తీఫ్) జైలు నుంచే మాస్టర్ ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడితోపాటు మరికొందరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత భగత్ నగర్ లోనూ వృద్ధుడిని చితకబాది యూపీకి చెందిన అతడి అల్లుడు, మనవడు బంగారం దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా ఏటీఎంల దోపిడీ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ పెట్రోలింగ్ సరిగ్గా లేకపోవడంతో ఇండ్లలోనూ తరచూ దొంగతనాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
